బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి 'దానా' తుపానుగా మారిందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గురువారం తెల్లవారు జామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందొచ్చునని, గురువారం అర్థరాత్రి తరువాత ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్ కు ఆగ్నేయంగా 670 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐల్యాండ్ కు దక్షిణ – ఆగ్నేయంగా 720 కిలో మీటర్లు, బంగ్లాదేశ్ లోని ఖేపుపురకు దక్షిణ – ఆగ్నేయంగా 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుపాను కారణంగా ఏపీలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. తుపాను తీరందాటే సమయంలో భీకర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తరువాత శుక్రవారం మధ్యాహ్నం వరకు తుపానుగా బలహీనపడి క్రమంగా తీవ్రత తగ్గి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పుకోస్తా రైల్వే పరిధిలో సుమారు 70 రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు.
0 Comments