జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ లేదా కూటమికి మెజారిటీ రాదని, అయితే జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్మూకశ్మీర్‌లో అధికారానికి 46 సీట్లు గెలుచుకోవాల్సి ఉండగా, ఏ రాజకీయ పార్టీ మెజారిటీ మార్క్‌ను చేరుకోలేదని 'పీపుల్స్ పల్స్' అంచనా వేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 33 నుంచి 35 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలవనుందని, బీజేపీకి 23 నుంచి 27 సీట్లతో రెండో పెద్ద పార్టీగా అవతరించనుందని పేర్కొంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13-15 సీట్లు, పీడీపీ 7-11 సీట్లు, ఇతరులు 4-5 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. ఇండియా టుడే-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, జమ్మూలోని 43 సీట్లలో బీజేపీ 27-31 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి 11-15 సీట్లు దక్కించుకుంటాయి. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ 20 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి 35 నుంచి 40 సీట్లు, పీడీపీ 4 నుంచి 7 సీట్లు, ఇతరులు 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నికల అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా శనివారంనాడు స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో తమకు వచ్చే ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఓట్లని చెప్పారు. ముస్లింలను పెట్టిన కష్టాలు, దుకాణాలు, ఇళ్లు, మసీదులు, పాఠశాలలపై బుల్డోజర్ చర్యలకు పాల్పడిన బీజేపీతో చేతులు కలుపుతామని అనుకుంటున్నారా? అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. బీజేపీకి జమ్మూకశ్మీర్ ప్రజలు ఓటు వేశారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అనుకుంటే వాళ్లు ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్టేనని అన్నారు.
0 Comments