శబరిమలలో రాబోయే మండలం మకరవిళక్కు సీజన్ కోసం శబరిమల ఆలయ దర్శన సమయాలను రీషెడ్యూల్ చేసింది. భక్తుల కోసం దర్శన సమయాన్ని పెంచింది. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. భక్తుల దర్శనానికి 17 గంటల సమయం ఇచ్చింది. ప్రధాన పూజారితో సంప్రదింపులు జరిపిన తర్వాత దర్శన సమయంపై నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. "తాంత్రి (ప్రధాన పూజారి) ఈ విషయంలో చాలా సహకారాన్ని అందించారు. ఈసారి శబరిమలలో వర్చువల్ క్యూ వ్యవస్థ మాత్రమే అమలులో ఉంది, అయితే ప్రతి భక్తుడికి దర్శనానికి అవకాశం కల్పిస్తాం. అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటాం'' అని ప్రశాంత్ తెలిపారు. స్పాట్ బుకింగ్స్‌ని తొలగించి వర్చువల్ క్యూను మాత్రమే అనుమతించాలనే నిర్ణయంపై అనేక ఆందోళనలు తలెత్తున్నాయని ఆయన అన్నారు. గతేడాది తీర్థయాత్ర సమయంలో విపరీతమైన రద్దీని చూశామని, దీంతో పోలీసులు వారిని అడ్డుకోవాల్సి వచ్చిందని, ఆ రోజుల్లో 20,000 కంటే ఎక్కువ స్పాట్ బుకింగ్స్ ఉన్నాయని చెప్పారు. మాకు భక్తుల సంఖ్య ముఖ్యం కాదని, భక్తుల భద్రతే ముఖ్యమని చెప్పారు. ఈ ఏడాది శబరిమల దర్శనానికి కేరళ ప్రభుత్వ ఆన్‌లైన్ బుకింగ్స్ విధానాన్ని తీసుకువచ్చింది.
0 Comments