పార్లమెంటులోని తన గదిలోకి కొందరు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌కు లేఖ రాశారు. సీపీడబ్ల్యూడీ, సీఐఎస్ఎఫ్, టాటా ప్రాజెక్ట్స్‌కు చెందిన కొందరు ఈ చర్యకు పాల్పడినట్టు ధన్‌ఖడ్ దృష్టికి తెచ్చారు. ''ఇదొక అసాధారణ పరిణామం. అధికారుల చర్య ఒక ఎంపీగా, రాజ్యసభలో విపక్ష నేతగా నాకున్న ప్రత్యేక అధికారాలను, పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఏ హోదాలో నాకు కేటాయించిన ఛాంబర్‌లోకి వారు అడుగుపెట్టారు?'' అని ఆ లేఖలో ఖర్గే ప్రశ్నించారు. ఇది పూర్తిగా తన హోదాను అగౌరవపరచమేనని, ఇదెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఏ అథారిటీతో, ఎవరి ఆదేశాలతో తన అనుమతి లేకుండా అధికారులు తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారో తనకు తెలియాలన్నారు. విపక్ష నేత గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, అనుమతి లేకుండా తన ఛాంబర్‌లోకి అధికారులు ప్రవేశించారంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై సీఐఎస్ఎఫ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ విషయం పట్ల అవగాహన కలిగిన ఒక అధికారి దీనిపై మాట్లాడుతూ, పార్లెమెంటులో రెనొవేషన్, నిర్మాణం పనులు ఏవైనా ఉంటే ప్రొటోకాల్‌లో భాగంగా సీఐఎస్ఎఫ్. ఇతర ఎజెన్సీల సిబ్బంది అక్కడ ఉంటారని చెప్పారు. వివిధ కార్యాలయాల్లో మెయింటెనెన్స్ పనులు ఉంటాయని, అయితే కార్యాలయాల తాళాలు సీఐఎస్ఎఫ్ వద్ద ఉండవని చెప్పారు. పార్లమెంటు చుట్టూ భద్రత అనేది సీఐఎస్ఎఫ్ పని అని చెప్పారు. మెయింటనెన్స్ వర్క్ ఉన్నప్పుడు తమకు సమాచారం ఉస్తారని, ఎలాంటి అవకతవకలు జరక్కుండా ఆయా కార్యాలయాల వద్ద అధికారుల వెంట తాము ఉంటామని తెలిపారు.
0 Comments