Ad Code

జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం !


జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల సమయంలో ఎన్సీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం 90 స్థానాల్లో పోటీచేసి 48 చోట్ల గెలిచాయి. అయితే, ఎన్సీ 42 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 06 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఎన్సీకి ఇండిపెండెంట్లు, ఆప్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ మెజారిటీ మార్క్ 46ని దాటింది. రాబోయే ఎన్సీ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిని తిరస్కరించిన కాంగ్రెస్, బదులుగా బయట నుంచి మద్దతు అందిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హోదాపై ఎన్సీ చర్చలు జరుపుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఇదిలా ఉంటే, ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే హాజరయ్యారు. వీరితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా ప్రమాణస్వీకారానికి వెళ్లారు. షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు ముఖ్యమంత్రి మరియు ఆయన మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేశారు. కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉదయం 11:30 గంటలకు అబ్దుల్లా మరియు అతని మంత్రులతో పదవీ ప్రమాణం చేయించారు. జమ్మూ కాశ్మీర్‌లో చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ, పీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ తర్వాత పరిణామాల్లో బీజేపీ మద్దతుని జూన్ 19, 2018లో ఉపసంహరించుకుంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. దీని తర్వాత ఏడాదికి ఆర్టికల్ 370 రద్దు చేశారు. స్పెషల్ స్టేటస్ తీసేసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఎన్సీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్సీ తర్వాత 29 ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Post a Comment

0 Comments

Close Menu