మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రాక్టీస్ సందర్భంగా ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్‌ఫైర్ కావడంతో ఇద్దరు ఆర్మీ అగ్నివీరులు మరణించారు. మృతులిద్దరూ ఫైరింగ్ శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి నాసిక్‌కు వెళ్లారు. దేశసేవ చేయాలని భావించిన వారు ఆ ఆశ తీరకుండానే అసువులు బాసారు. మృతులు విశ్వరాజ్ సింగ్ (20), సైఫట్ షిట్ (21) గా గుర్తించారు. డియోలాలిలోని ఆర్టిలరీ స్కూలులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక షెల్ పేలడంతో ఇద్దరు అగ్నివీరులకు తీవ్రగాయాలయ్యాయని, వారిని డియోలాలిలోని ఎంహెచ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని అధికారులు తెలిపారు. కాగా, ఘటనపై హవిల్దార్ అజిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు గన్ పేలి ఇద్దరు అగ్నివీరులు మృతి చెందినట్టు డియోలాలి క్యాంప్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఇదే తరహా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూడా చోటుచేసుకుంది. మాక్ డ్రిల్ జరుగుతుండగా మంటలను ఆర్పే యంత్రం పేలడంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన అగ్నివీర్ సౌరభ్ పాల్ (24) మృతి చెందాడు.
0 Comments