హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఒక్కసారిగా వర్షం కురవడం ఉపశమనాన్నిచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, సరూర్ నగర్, కొత్త పేట, మలక్‌పేట పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, కీసర, ఘట్ కేసర్, అబ్దుల్లాపూర్ మెట్, నాంపల్లి, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. సద్దుల బతుకమ్మ వేడుకలు ఓ వైపున, వర్షం కూడా కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. ఇవాళ రాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
0 Comments