కాంగ్రెస్ అంటే విభజించు పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పర్యాయ పదమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దుయ్యబట్టారు. భాజపా వల్లే అభివృద్ధి జరుగుతుందన్నారు. హర్యానా ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న ఆయన శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి నైనా దేవి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరియాణా, జమ్మూకశ్మీర్‌లో భాజపా చాలా సాధించిందన్న ఆయన ఈ క్రెడిట్ అంతా ప్రజలు, ఆ భగవంతుడికే దక్కుతుందన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో కూడా క్లీన్‌స్వీప్ చేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. అనంతరం భాజపా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నడ్డా మాట్లాడారు. హిమాచల్‌లో తాము చేపట్టిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ''మీరు ఇక్కడ చూస్తున్న ప్రతి ఇటుకా భాజపా హయాంలో వేసినదే. ప్రజలు నీటి కోసం ఉదయం 4 గంటలకే నిద్రలేచి గంటల తరబడి బకెట్లు పట్టుకొని వేచి ఉండే రోజులను నేను చూశాను. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కుళాయి ఉంది. గ్రామాలకు రోడ్లు వేసి అనుసంధానం చేశాం'' అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పనితీరుతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు. హరియాణా యువత, రైతులు, మహిళలు.. అన్ని వర్గాల వారు ప్రతిపక్ష పార్టీలకు తగిన పాఠం నేర్పారని తెలిపారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ ఫలితాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం నియంత్రలోనే ఉందని తెలిపారు. భాజపా పాలన అంటే కేవలం అధికారంలో కూర్చోవడానికి కాదు.. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకని చెప్పారు. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించిన నడ్డా.. ''ఇది యుద్ధానికి సమయం కాదు.. అభివృద్ధికి సమయం ఆస్నమైంది.. అందరూ కలిసికట్టుగా నడవాలని మోదీ అన్నారు'' అని గుర్తు చేశారు.
0 Comments