Ad Code

జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసు పెట్టొద్దు : సుప్రీంకోర్టు


ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రన జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదని భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అలా చేస్తే భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఓ జర్నలిస్టు వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పించింది. ప్రభుత్వ పాలనా విభాగంలో కుల సమీకరణాలకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ ఓ కథనం రాశారు. దీనిపై యూపీ పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీనిని కొట్టివేయాలని కోరుతూ అభిషేక్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ''ప్రజాస్వామ్య దేశాల్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(a) ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది. కేవలం జర్నలిస్టులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి, వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదు'' అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణ నవంబర్‌ 5కు వాయిదా వేసింది.

Post a Comment

0 Comments

Close Menu