హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసేందుకే భాజపా డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెరోల్‌పై విడుదల చేసేందుకు ఆమోదం ఇచ్చిందని కాంగ్రెస్ మండిపడింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారికి హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేఖ రాసింది. '' గుర్మీత్ సింగ్ పెరోల్‌పై విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయనకు పెరోల్ లభించడం చట్టవిరుద్ధం.ఈ చర్య ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లే '' అని కాంగ్రెస్ తన లేఖలో పేర్కొంది. గత రెండేళ్లలో గుర్మీత్ పెరోల్‌పై విడుదలవ్వడం ఇది పదోసారని గుర్తు చేసింది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో 2017లో న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఆ కేసులో సీబీఐ కోర్టు ఆయనకు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికల ముందు 20 రోజుల పెరోల్‌కు ఆయన చేసిన అభ్యర్థనకు ఆమోదం లభించడం చర్చనీయాంశమైంది. పలు కేసుల్లో నిందితుడైన ఆయనకు రాష్ట్రంలో భారీ అనుచరగణం ఉంది. తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలూ లేకపోలేదు. భాజపా ఉద్దేశపూర్వకంగానే గుర్మీత్‌ను విడుదల చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
0 Comments