11,72,240 మంది రైల్వే ఉద్యోగుల కోసం మొత్తం రూ. 2,028.57 కోట్లతో ఉత్పాదకత లింక్డ్ బోనస్ చెల్లింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా తీసుకున్న కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. అలాగే 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్'కు ఆమోదం తెలిపిందన్నారు. రూ.10,103 కోట్లతో నూనె గింజల ఉత్పత్తి చేయాలని నిర్ణయించిందని చెప్పారు. ఇక వంట నూనెల విషయంలో విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. నేషనల్ మిషన్ ఏడేళ్ల పాటు అమలు కానుందని చెప్పారు. తమిళనాడు రాజధాని చెన్నైలో 118.9 కి.మీ మేర 128 స్టేషన్లతో నిర్మించనున్న చెన్నై మెట్రో ఫేజ్-2కు కేంద్ర మంత్రి వర్గం పచ్చ జెండా ఊపిందని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 63,246 కోట్లుగా కేంద నిర్ణయించిందని వివరించారు. ఫేజ్-2లో భాగంగా ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు మొత్తం 3 మెట్రో కారిడార్లు నిర్మించాలని.. అవి మాధవరం నుంచి సిప్కాట్ వరకు, లైట్ హౌస్ నుంచి పూనమల్లీ బైపాస్ వరకు, మాధవరం నుంచి శోలింగనూర్ వరకు ఈ కారిడార్లను విస్తరిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
0 Comments