Ad Code

ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి భాజపా నీచ రాజకీయాలే కారణం !


ఢిల్లీ నగరంలో పెరుగుతున్న వాయు, నీటి కాలుష్యానికి భాజపా నీచ రాజకీయాలే కారణమని  సీఎం ఆతిశీ మండిపడ్డారు. నగరంలో గాలి నాణ్యత క్షీణత మొదలవ్వడంతో కాళిండికుంజ్ వద్ద యమునా నది ఉపరితలంపై విషపూరిత రసాయనాల నురగ కనబడటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆప్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన ఆతిశీ, ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణించడానికి భాజపా పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్ కారణమని ఆరోపించారు. హర్యానాలో పంట వ్యర్థాల దహనం, డీజిల్‌ బస్సులు, ఇటుక బట్టీలు ఒకకారణం కాగా,  ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ -ఘాజియాబాద్‌ సరిహద్దులోని కౌశాంబి బస్‌ డిపోకు వేల సంఖ్యలో డీజిల్‌ బస్సులు రావడం, దేశ రాజధాని పరీవాహక ప్రాంతంలో ఇటుక బట్టీలు, ఈ ప్రాంతంలోని థర్మల్‌ ప్లాంట్లు కూడా వాయు కాలుష్యానికి ఒక కారణంగా పేర్కొన్నారు. యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయకపోవడం వల్లే నదిపై నురగ ఏర్పడుతోందంటూ భాజపాపై విరుచుకుపడ్డారు. యమునా నది ఉపరితలంపై ఏర్పడిన నురగను తొలగించేందుకు ఆదివారం రాత్రి నుంచి సిలికాన్‌ ఆధారిత డిఫోమర్లను వినియోగిస్తామన్నారు. హర్యానా రోజుకు 165 మిలియన్‌ గ్యాలన్ల పారిశ్రామిక వ్యర్థజలాలను బాధ్షాపుర్‌, ముంగేశ్‌పుర్‌, ఇతర కాల్వల ద్వారా యమునా నదిలోకి విడుదల చేస్తుండగా.. యూపీ సైతం 65 మిలియన్‌ గ్యాలన్ల నీటిని వివిధ కాల్వల ద్వారా వదులుతోందని ఆతిశీ మండిపడ్డారు. దేశ రాజధాని నగరంలో వాయు, నీటి కాలుష్యం పెరగడానికి భాజపా మురికి రాజకీయాలే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం పంజాబ్‌ పంట వ్యర్థాల దహనాలను సగానికి తగ్గగా.. యూపీ, హరియాణాల్లో మాత్రం పెరిగాయన్నారు. ఈ చర్యలే భాజపా నీచ రాజకీయాలకు అద్దంపడుతున్నాయని పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రభుత్వం తగ్గించగలిగినప్పుడు, హర్యానా, ఉత్తరప్రదేశ్ లోని భాజపా ప్రభుత్వాలు ఎందుకు తగ్గించలేవని ప్రశ్నించారు. 

Post a Comment

0 Comments

Close Menu