Ad Code

బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా కె.లక్ష్మణ్‌ !


బీజేపీ దేశ వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను భాజపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు అప్పగించింది. ఈ మేరకు ఆయన్ను భాజపా సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది. భాజపా ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ, భాజపా లోక్‌సభ ఎంపీ సంబిత్‌ పాత్రా, రాజ్యసభ ఎంపీ నరేశ్‌ బన్సల్‌లను సహాయ రిటర్నింగ్‌ ఆఫీసర్‌లుగా నియమిస్తూ మంగళవారం భాజపా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకాలకు ఆమోదం తెలిపారు. తెలంగాణకు చెందిన కె.లక్ష్మణ్‌ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన భాజపా ఓబీసీ మోర్చ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. మరోవైపు, భాజపా కొత్త అధ్యక్షుడిని ఎన్నికొనే ప్రక్రియ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసి, దాదాపు సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాక భాజపా నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక ప్రక్రియ డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్‌ 2న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu