ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ట్రంప్ ఉండటంతో టెహ్రాన్‌కు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా కుట్ర యత్నం చేసినా దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగానే భావిస్తామని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. ట్రంప్‌నకు ముప్పు అంశంపై జోబైడెన్ నిత్యం అప్‌డేట్లు తెలుసుకోవడంతో పాటు, తగిన చర్యలకు బృందాన్ని ఆదేశిస్తున్నారని సదరు అధికారి తెలిపారు. ఇరాన్ కుట్రలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్‌లో ఉన్నతస్థాయి అధికారులకు బైడెన్ సూచనల మేరకు ఈ సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది. ట్రంప్ హత్యాయత్నానికి కుట్రలు చేయడాన్ని తక్షణమే ఆపేయాలని కోరినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ తాము అమెరికా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టంచేసింది. అదే సమయంలో వాషింగ్టన్ మాత్రం తమ అంతర్గత విషయాల్లో ఏళ్ల తరబడి జోక్యం చేసుకొంటోందని ఆరోపించింది. 1953లో తిరుగుబాటు నుంచి 2020 ఖాసీం సులేమానీ హత్య వరకు అమెరికానే చేసిందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ట్రంప్ స్వయంగా ఖాసీం సులేమానీ హత్యకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల ట్రంప్ ప్రచార బృందం ఓ ప్రకటన చేసింది. 'యూఎస్‌లో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు కచ్చితమైన ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది' అని ట్రంప్ ప్రచార బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు తెలిపింది. ఈ హెచ్చరికలపై ట్రంప్ నాడు ఎక్స్ వేదికగా స్పందించారు. 'నా హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది' అని ట్రంప్ పేర్కొన్నారు.
0 Comments