కేంద్రం రద్దు చేసిన 370వ అధికరణపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే 370వ అధికరణను రద్దు చేశారో వారి నుంచి తిరిగి దానిని రాబట్టుకోవాలనుకోవడం నిష్ప్రయోజనమని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అఖండ విజయం సాధించిన అనంతరం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''జమ్మూకశ్మీర్ నుంచి రద్దుచేసిన 370వ అధికరణ గురించి సంబంధిత వ్యక్తులతో వెంటనే మాట్లాడతామని మేము ఎప్పుడూ చెప్పలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ, ఆ ఆర్టికల్ గురించి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు'' అని ఒమర్ తెలిపారు. పార్టీ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని, 370వ అధికరణపై మౌనంగా ఉండామని కానీ, అది తమకు ఒక అంశం కాదని కానీ తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రజలను ఫూల్స్ చేయడానికి తాము సిద్ధంగా లేదని చెప్పారు. ఆర్టికల్ 370ను ఎవరైతే రద్దు చేశారో వారు తిరిగి దానిని పునురుద్ధరిస్తారనుకోవడం తెలివితక్కువతనం అవుతుందని తాను పదేపదే చెబుతూ వచ్చానని అన్నారు. అయితే తమ వరకూ ఈ అంశం సజీవంగానే ఉంటుందన్నారు. హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలను కాంగ్రెస్ తప్పనిసరిగా విశ్లేషించుకోవాలని, అది ఆ పార్టీ అంతర్గత విషయమైనందున అందుకు తగ్గట్టుగానే వారు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఒమర్ అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో తమ పార్టీకి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయని, రాబోయే ఐదేళ్లలో జమ్మూకశ్మీర్ అభివృద్ధికి తాము పనిచేస్తామని చెప్పారు.
0 Comments