కేరళ లోని కసర్గోడ్ నీలేశ్వరంలోని అంజుట్టంబలం వీరార్ కావు ఆలయంలో సోమవారం అర్థరాత్రి సమయంలో బాణాసంచా పేలి, భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో 150మంది గాయపడ్డారు. థేయంకట్ట మహోత్సవాన్ని చూసేందుకు ఆలయానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేడుకల్లో భాగంగా బాణాసంచా కాల్చడం మొదలుపెట్టారు. అయితే, బాణాసంచా వెళ్లి పక్కనే ఉన్న ఓ గదిలో పడింది. ఆ గదిలో అప్పటికే భారీ సంఖ్యలో బాణాసంచా ఉండటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఫలితంగా అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆలయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పేలుడు అనంతరం ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 150మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను నీలేశ్వరం, కనహంగద్లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
0 Comments