జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ఓ ముగిసిన ఘట్టమని, దానిని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో భాజపా మేనిఫెస్టో 'సంకల్ప పత్ర' ను విడుదల చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందులో 25 తీర్మానాలు ప్రకటించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడం అందులో మొదటిదన్నారు. అలాగే మహిళల ఆర్థిక భద్రత, స్వావలంబనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. శాంతియుత, సురక్షిత, సుసంపన్నమైన జమ్మూకశ్మీర్ సాధించుకోవడమే ఈ మేనిఫెస్టో లక్ష్యమని తెలిపారు. ''స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌కు భాజపా ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. ఈ నేలను చెక్కుచెదరకుండా ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. 2014 వరకు జమ్ముకశ్మీర్ వేర్పాటువాదం, ఉగ్రవాదం నీడలో ఉండేది. పలువురు నాయకులు రాష్ట్రంలో అస్థిరత సృష్టించారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. జమ్ముకశ్మీర్ చరిత్ర గురించి రాసినప్పుడు 2014 తర్వాత 10 ఏళ్ల కాలం గోల్డెన్ పీరియడ్‌గా మిగిలిపోతుంది'' అని అమిత్ షా అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో ఐదు దశల్లో జరిగాయి. ఈసారి మూడు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
0 Comments