స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగనుంది. అయితే ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనే క్రికెట్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఎలాంటి ఆటంకం లేకుండా సిరీస్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినప్పటికీ హిందూ మహా సభ నిరసన సెగలు అభిమానులను కలవరానికి గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో ఈ సిరీస్‌ను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిరసనలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతానికి చెన్నైలో నిరసన సెగ లేనప్పటికీ రెండో టెస్టు వేదిక కాన్పూర్‌లో, అలాగే తొలి టీ20 సిరీస్ జరిగే గ్వాలియర్‌లో హిందూ మహాసభ పెద్దఎత్తున నిరసనలు చేపట్టే అవకాశం ఉంది. హిందూమహా సభ ఉపాధ్యక్షుడు జయవీర్ భరద్వాజ్ నిరసనలు గురించి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందువులపై, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా గ్వాలియర్‌లో నిరసనలు చేపడతామని చెప్పారు. కాగా, ఈ నిరసనలపై బీసీసీఐ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుందని, ఆటగాళ్ల భద్రత విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ జట్టు ఆదివారం చెన్నైకి చేరుకుంది. భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులతో పాటు మూడు టీ20లు ఆడనుంది. గ్వాలియన్ వేదికగా అక్టోబర్ 6న తొలి టీ20, ఢిల్లీ వేదికగా అక్టోబర్ 9న రెండో టీ20, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12న ఆఖరి టీ20 జరగనుంది.
0 Comments