హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ''2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదు. దీని తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. ఏటా 3 లక్షల మంది యువత పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాం. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని వారిని అడుగుతున్నాం.' అని తెలిపారు. నిరుద్యోగ యువత 'డిమాండ్- సప్లయ్` సూత్రం గుర్తుంచుకోవాలి. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలి. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే చెడు వ్యసనాలకు ఆకర్షితులయ్యే ప్రమాదం పొంచి ఉంది. బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విష వలయంలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదు. అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి'' అని రేవంత్రెడ్డి అన్నారు. ''ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడం. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో 30లక్షల మంది నమోదు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత కూడా 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం. త్వరలో మరో 35వేల పోస్టులు భర్తీ చేస్తాం. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి'' అని సీఎం తెలిపారు.
0 Comments