ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. జగన్ ప్రభుత్వం చేసినట్టు ప్రస్తుత ప్రభుత్వంలో చేయడం కుదరదని ఆయన తేల్చి చెప్పారు. గతంలో 2019-24 మధ్య అప్పులు చేసేందుకు లెక్క చూసుకోలేదని, అందిన కాడికి అప్పులు చేశారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. సీఎం చంద్రబాబు వ్యూహం వేరేగా ఉందని పీయూష్ కుమార్ చెప్పారు. ఇష్టానుసారం అప్పులు చేసి, అధిక వడ్డీలు చెల్లించాలని ప్రభుత్వం భావించడం లేదన్నారు. ప్రతి రూపాయికీ లెక్క చూపించి, అవసరమైన మేరకు అప్పులు చేసేందుకు మాత్రమే ముందుకు సాగాలని నిర్ణయించినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో పలు కార్పొరేషన్ల ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని, ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్ల విషయాన్ని వాటికే వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు పీయూష్ తెలిపారు. ఇక, గత ఐదేళ్లలో పెండింగులో ఉన్న బిల్లుల విషయాన్ని సీఎం సీరియస్‌గానే పరిగణిస్తున్నారని, అయితే ఇప్పటికిప్పుడు వాటిని చెల్లించే పరిస్థితి లేదన్నారు. సుమారు రూ.1.30 లక్షల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఖజానాకు ఆదాయం పెంచడంతో పాటు ప్రభుత్వ ఖర్చులు కూడా తగ్గించుకునే దిశగా సర్కారు ప్రయత్నిస్తున్నట్టు పీయూష్ కుమార్ స్పష్టం చేసారు. దీంతో సంపద సృష్టిపై ఎక్కువగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంపద సృష్టి తర్వాత రాష్ట్రంలో పాలన మరింత గాడిలో పడుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు చాలా దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని వివరించారు. కాగా పీయూష్ కుమార్ గతంలో పలు జిల్లాల్లో కలెక్టర్‌గా చేశారు. జగన్ అధికారంలోకి రావడానికి ముందు ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. చంద్రబాబు వచ్చాక ఆయనను తిరిగి తెచ్చుకుని ఆర్థిక శాఖ అప్పగించారు.
0 Comments