ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా చోలాస్ గ్రామంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఇంటి పైకప్పు కూలి శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ III) అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని చోలాస్ గ్రామంలో శనివారం భారీ వర్షం కురవడంతో.. ఇంటి పైకప్పు కూలిపోయిందని తెలిపారు. దీంతో అందులో నివసిస్తున్న ఏడుగురిపై శిథిలాలు పడటంతో.. వారు అందులోనే ఉండిపోయారు. అనంతరం.. స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తీశారని చెప్పారు. శిథిలాల కింద ఉన్న వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. ఇంటి పైకప్పు కూలిపోవడంతో 34 ఏళ్ల సైఫ్ అలీ, 50 ఏళ్ల షకీలా, 2 ఏళ్ల అలీ ఖాన్, 4 ఏళ్ల సోహన్, 34 ఏళ్ల షాహిద్, 8 ఏళ్ల షాన్, 3 ఏళ్ల తైమూర్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని.. శిథిలాల నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments