హర్యానాలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందని, అందులో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని అందుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఛండీగఢ్‌లో కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తోందని, పక్కా ప్రణాళిక ప్రకారం ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో నిరుద్యోగ కొరతకు మోడీ కారణం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారనీ ఒకరిని చూసి మరొకరు అసహ్యించుకునేలా తయారు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని ఓడించడం ద్వారా ప్రధాని మోడీకి దేవుడు గుణపాఠం చెప్పారని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయదు కానీ పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేస్తుందని రాహుల్ ఆరోపించారు. ఈసారి హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించనున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. ప్రతి నెల రూ. 500 విలువైన గ్యాస్ ఇస్తుందని రాహుల్ చెప్పారు. మహిళా సాధికారత కోసం ప్రతి నెల రూ. 500 గ్యాస్ కోసం ఇస్తామని, యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రైతుకు ఎమ్మెస్పీ హామీలు, పంట నష్టపోయిన వెంటనే బీమా సొమ్ము ఇస్తామని చెప్పుకొచ్చారు. హర్యానాలో బీజేపీ కుప్పకూలడం ఖాయమని, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో ఉపాధి లేకపోవడంతో అమెరికాకు వలస వెళ్లి కష్టపడుతున్నారని చెప్పారు. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉంటే.. యువతకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు. ప్రజల తలరాతలు మారాలంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
0 Comments