Ad Code

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు పార్లమెంటులో పోరాడతాం !


మ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు పార్లమెంటులో పోరాడతామని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. దాని కోసం వీధుల్లోకి కూడా వెళ్తామని అన్నారు. బుధవారం జమ్మూలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ప్రజల శ్రేయస్సును అంతం చేయడానికి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), బయటి వ్యక్తుల ద్వారా ఈ ప్రాంతాన్ని నడపాలని బీజేపీ భావించిందని విమర్శించారు. అందుకే జమ్మూ కాశ్మీర్‌  రాష్ట్ర హోదాను లాక్కున్నదని ఆరోపించారు. 'లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ ఉండే వరకు, జమ్మూ కాశ్మీర్‌ ప్రజల కష్టాల వల్ల బయటి వ్యక్తులు ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు' అని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలు ప్రజల హక్కులకు సంబంధించినవని రాహుల్‌ గాంధీ తెలిపారు. 'రాష్ట్ర హోదాను మేం పునరుద్ధరిస్తాం. స్థానిక పరిశ్రమలను మా ప్రభుత్వం కాపాడుతుంది. సామాన్యుల కోసం బ్యాంకుల తలుపులు తెరుస్తాం' అని అన్నారు. దేశ చరిత్రలో 1947 నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా, రాష్ట్రాలను రెండుగా విభజించిన సందర్భాలు ఉన్నాయని రాహుల్‌ గాంధీ తెలిపారు. అయితే ఏనాడూ ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించలేదన్నారు. ఇది ప్రజలకు తీవ్ర అన్యాయమని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ హరించిందని విమర్శించారు. ఎన్నికల ముందు రాష్ట్ర హోదాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని తామంతా భావించామని, అదే సరైన మార్గమని రాహుల్‌ గాంధీ తెలిపారు. అయితే వారు (బీజేపీ) మొదట ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. 'ఏదైనా కారణం చేత బీజేపీ దీనిని చేయకపోతే, ఇండియా కూటమి ప్రభుత్వం మొదటి పని ఇదే. ఎందుకంటే రాష్ట్ర హోదా ఇవ్వడం మీ హక్కు' అని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu