గుజరాత్‌లోని సూరత్‌లో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్‌లైన్‌లో వస్త్ర దుకాణం పేరుతో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి నిల్వ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆదివారం మాట్లాడుతూ గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ ఆన్‌లైన్ వస్త్ర దుకాణం కార్యాలయంలో నకిలీ నోట్ల ముద్రణ జరుగుతోందని తెలిపారు. ఈ కేసులో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌దీప్ నకుమ్ మాట్లాడుతూ.. నిందితులు నటుడు షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’ నుంచి ప్రేరణ పొందారని, ఇందులో నకిలీ నోట్ల వ్యాపారం చేయడం ద్వారా ధనవంతులుగా మారే పాత్రను ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపారు. సూరత్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) అధికారులు శనివారం సార్థనా ప్రాంతంలోని ఓ కార్యాలయంపై దాడి చేసి నాణ్యమైన, అసలు నోట్లను పోలి ఉన్న రూ.1.20 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఘటనా స్థలం నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను విచారించిన తరువాత, నాల్గవ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆన్‌లైన్ దుస్తుల వ్యాపారం పేరుతో ఓ వాణిజ్య భవనంలో కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. వాస్తవానికి అక్కడ నకిలీ నోట్లను ముద్రించే పని జరిగింది. అనుమానం రావడంతో ఎస్‌ఓజీ బృందం కార్యాలయం, అక్కడ పని చేసే వ్యక్తులపై నిశితంగా నిఘా ఉంచింది. ముగ్గురు నిందితులు నకిలీ నోట్ల ముద్రణ కోసం కలుసుకున్నప్పుడు దాడి చేసి వారిని పట్టుకుంది. ఆ కార్యాలయంలో నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించే పేపర్, కలర్ ప్రింటర్, ప్రింటింగ్ ఇంక్, ల్యామినేషన్ మిషన్ వంటి పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
0 Comments