'బుల్డోజర్ న్యాయ్' పేరుతో దేశంలో రాష్ట్రాల వారీగా చేపడుతున్న నివాసాలు, ఇతర ప్రైవేట్ ఆస్తుల కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ బి.ఆర్.గవయ్, జస్టిస్ కె.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఎటువంటి కూల్చివేతలు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.ఈ ఆదేశాలు చట్టబద్ధంగా మంజూరు చేయబడిన కూల్చివేతలపై ప్రభావం చూపుతాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తదుపరి విచారణ వరకు కూల్చివేతలను నిలిపివేయడంతో ఆకాశం ఊడి కిందపడదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కీర్తి కోసం, ఇతరులను ఆకర్షించేందుకు బుల్డోజర్ కూల్చివేతలు చేపడుతున్నట్లు ఉందని జస్టిస్ కె.వి.విశ్వనాథన్ మండిపడ్డారు. స్పష్టమైన నిబంధనలు జారీ చేసేవరకు కూల్చివేతలపై నిషేధం విధించాల్సిన సమయమిదని జస్టిస్ గవై వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్ 1కి వాయిదా వేసింది. కూల్చివేతలపై అదనపు చట్టపరమైన ఆదేశాలు, మార్గదర్శకాలు కోరుతూ జమియాత్ ఉలేమా -ఇ- హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
0 Comments