పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా 5975 ప్రత్యేక రైళ్లను నడిపబోతున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. దీపావళి, దసరా, ఛత్ పండగల కోసం దేశవ్యాప్తంగా రాకపోకలు ముమ్మరంగా సాగుతాయి. ప్రత్యేకంగా రైళ్లను నడిపించడంతోపాటు ఇప్పుడు నడుస్తున్న రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి 4429 రైళ్లను నడపగా, ఈ ఏడాది 5975 రైళ్లను నడుపుతున్నట్లు మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న 108 రైళ్లకు జనరల్ బోగీల సంఖ్యను పెంచింది. కొత్తగా 12,500 బోగీలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల కోట్ల మంది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. రెండు నెలల క్రితమే భారతీయ రైల్వే ఓ కీలక ప్రకటన చేసింది. పండగలతో సంబంధం లేకుండా సాధారణంగా దూరప్రాంతాలకు ప్రతిరోజు నడుస్తున్న రైళ్లల్లో జనరల్ బోగీలు సరిపోవడంలేదని, ఇందులో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోందని, చివరకు మరుగుదొడ్లలో కూడా నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని, ఇటువంటి ఇక్కట్లను తప్పించాలని, అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలంటూ రైల్వేపై ఒత్తిడి వచ్చింది. దీంతో దూర ప్రాంతాలకు ప్రయాణించే అన్ని రైళ్లకు రెండు జనరల్ బోగీలను ఈ నెలాఖరు నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జోన్ల పరిధిలో, డివిజన్ల పరిధిలో తిరిగే రద్దీ రైళ్లకు కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
0 Comments