స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సుప్రీం కోర్టు వెలువరించిన వాటిలో దాదాపు 37 వేల తీర్పులను ఇప్పటి వరకు హిందీలోకి అనువదించినట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. వివిధ భారతీయ భాషల్లోకి తీర్పులను అనువదించే ప్రక్రియ కొసాగుతోందని తెలిపారు. సుప్రీం కోర్టు ఇప్పటివరకు ఇచ్చిన తీర్పుల్లో ఎక్కువగా హిందీలోకి అనువదించగా, ఆ తర్వాతి స్థానంలో తమిళం ఉన్నట్లు వెల్లడించారు. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. రాజ్యాంగం గుర్తించిన ప్రాంతీయ భాషల్లోకి తీర్పులను అనువదిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపర్చిన 22 భాషల్లోకి అనువదిస్తున్నట్టు తెలిపారు. అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. విచారణ సమయంలో ఈ-ఎస్‌సీఆర్ ఉపయోగించి పాత తీర్పులను ప్రస్తావించాలని న్యాయవాదులకు జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఈ-ఎస్‌సీఆర్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పులను ఉచితంగా పొందేందుకు సామాన్య ప్రజలు, న్యాయ విద్యార్థులకూ వీలు కల్పించింది. ఈ ప్రాజెక్టును 2023లో ప్రారంభించింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఈ-ఎస్‌సీఆర్‌ను ఉపయోగించి తమ వాదనల్లో గతంలో ఇచ్చిన తీర్పులు ఉదహరించుకోవచ్చు. ఈ తీర్పులు సుప్రీంకోర్టు వెబ్‌సైట్, మొబైల్ యాప్, నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ)కి సంబంధించిన పోర్టల్‌లోనూ అందుబాటులో ఉంటాయి. అయితే.. సుప్రీం తీర్పుల అనువాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో అందుబాటులోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
0 Comments