Ad Code

ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం !


న్యూఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విస్తృ‌త స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటితోపాటు సంస్థాగత విషయాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై పార్టీ శ్రేణులతో మల్లికార్జున ఖర్గే చర్చించారు. సెబి, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే స్టాక్ మార్కెట్లో చిన్న పెట్టుబడిదారుల నగదు ప్రమాదంలో పడకూడదని పేర్కొన్నారు. ఈ మోడీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్‌తో తన పదవికి రాజీనామా చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, తగ్గుతున్న గృహ పొదుపు సమస్యలు దృష్టి సారించాలని నిర్ణయించారు. దేశంలోని రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కుల గణన అనేది దేశ ప్రజల డిమాండని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రైతులకు కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఆ దిశగా కొనసాగిస్తుందన్నారు. మన దేశంలోని యువతలో దేశభక్తి అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సైనిక దళాల్లో యువత పని చేసేందుకు తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ భేటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. మరోవైపు ఈ అంశాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu