Ad Code

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ ?


తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికలో అభిషేక్ మను సింఘ్వీని బరిలో నిలపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ నుంచి తనను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అభిషేక్ సింఘ్వీ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఆ పార్టీలోని సీనియర్లందరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్జతలు తెలిపారు. తన పట్ల కృతజ్జత ప్రదర్శించి ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో హిమాచల్‌ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవి కాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన విషయం విధితమే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో కే. కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు హస్తం పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావుతోపాటు ఆయన కుమార్తె, కుమారుడు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ పదవికి కే కేశవరావు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభ ఉప ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 3వ తేదీన రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు ఆగస్ట్ 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాంటి వేళ.. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీని బరిలో నిలపాలని ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu