Ad Code

అయిదు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ !


దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్‌, కోంకణ్ ప్రాంతం, గోవా, మధ్య మహారాష్ట్రలకు భారత వాతావరణ విభాగం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి కొద్ది రోజుల్లో ఆ యా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుణె, జార్ఖండ్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లో వర్షపు నీటి స్థాయిలు పెరిగాయని భారత వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అలాగే రానున్న రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే దేశ రాజధాని న్యూఢిల్లీలో సాధారణ స్థాయి వర్షపాతం మాత్రమే నమోదవుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న కుంభవృష్టి దాటికి భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో 13 మంది మరణించారు. గత వారం రోజులుగా కూలు, మండి, సిమ్లాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. కోండ చరియలు సైతం భారీగా విరిగి పడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 87 రహదారులను ప్రభుత్వం మూసివేసింది. మరోవైపు 40 మంది హిమాచల్ ప్రదేశ్ వాసులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కుంభవృష్టి వర్షాల కారణంగా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పుణె మహానగరంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే సోమవారం పర్యటించనున్నారు. భారీ వర్షాల కారణంగా పుణెలో వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఈ రోజు సైతం పుణెలో భారీ వర్షం కురువనుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అందులోభాగంగా నగరంలో అత్యవసర ఏర్పాట్లతోపాటు సహాయక చర్యలు చేపట్టడంపై ఆయన ఉన్నతాదికారులతో చర్చించనున్నారు. నగరంలో వివిధ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించనున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సేవలను వినియోగించుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం విధితమే. ఇంకోవైపు పుణెలో వరద పరిస్థితి కారణంగా. కడక్‌వాస్లా డ్యామ్ నుంచి ముత్తా నదిలోకి 45 వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu