వినోద్ కాంబ్లి ఇప్పుడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతనికి సంబంధించి వీడియో ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా తరఫున 1990ల్లో టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన 52 ఏళ్ల వినోద్ కాంబ్లి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిపోయింది. కనీసం తన కాళ్లపై తాను నడవలేని దీన స్థితిలో అతడు ఉన్నాడు. అతన్ని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు నడవడానికి సాయం చేస్తున్న వీడియో ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన ఫ్యాన్స్ నీ ఫ్రెండ్ ను జాగ్రత్తగా చూసుకో అని, సాయం చేయమని సచిన్ టెండూల్కర్ ను అడుగుతున్నారు. కాంబ్లి ఆరోగ్యం అస్సలు బాగోలేదని ఆ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఆ వీడియోలో ఉన్న కాంబ్లినేనా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ మరణానికి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేసిన సచిన్, నీ ఫ్రెండ్ దుస్థితి కనిపించడం లేదా అంటూ కొందరు టెండూల్కర్ ను నిలదీయడం గమనార్హం. వినోద్ కాంబ్లి గత దశాబ్ద కాలంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. 2013లో అతనికి గుండెపోటు కూడా వచ్చింది. అంతకుముందు అతనికి సర్జరీ కూడా జరిగింది. క్రికెట్ లో ఉవ్వెత్తున ఎగిసినా తర్వాత సచిన్ లాంటి క్రమశిక్షణ లేక క్రమంగా తెరమరుగైపోయిన కాంబ్లి, తర్వాత ఆల్కహాల్ కు బానిసై ఇంత వరకూ తెచ్చుకున్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
0 Comments