రైల్వేశాఖ తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. ట్రైన్ కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా? అని భాజపా ఎంపీ సమర్ సింగ్ సోలంకీ ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ ''లఖ్‌నవూ మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చాం. లఖ్‌నవూ మెయిల్‌లోని ఒక కోచ్‌లో రెండు దిగువ బెర్త్‌లకు వాటిని అమర్చాం. దీనిపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో ప్రశంసలు అందాయి. అయితే సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టి వచ్చాయి. ప్యాసింజర్ కోచ్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అది నిరంతర ప్రక్రియ'' అని మంత్రి వెల్లడించారు. బేబీ బెర్తులు అనేవి పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడకలు. లోయర్ బెర్త్‌కు అటాచ్ అయి ఉంటాయి. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్‌పై తమ చిన్నారులను పడుకోబెట్టుకోవచ్చు. సాధారణంగా అయితే ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డా సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు బేబీ బెర్త్ సాయంతో పిల్లల్ని తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టొచ్చు. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్ బెర్త్ కిందికి మడతపెట్టొచ్చు. శిశువును సురక్షితంగా ఉంచడానికి పట్టీలూ ఉన్నాయని గతంలో అధికారులు వెల్లడించారు.
0 Comments