Ad Code

హిమాచల్‌ ప్రదేశ్ లో "స్క్రబ్ టైఫస్" కారణంగా వ్యక్తి మృతి !


హిమాచల్ ప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో తొలి మరణం సంభవించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజిఎంసి)లో స్క్రబ్ టైఫస్‌కు చికిత్స పొందుతూ పంథాఘటి ప్రాంతానికి చెందిన 91 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు వారు తెలిపారు. ఆగస్టు 2న స్క్రబ్ టైఫస్‌కు పాజిటివ్‌గా తేలిన తర్వాత అతడికి చికిత్స ప్రారంభించారు. ఆ వ్యక్తి బుధవారం మరణించినట్లు వెల్లడించారు. సిమ్లాలో ఇప్పటి వరకు 44 కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ అనేది కీలకాలు కుట్టడం వల్ల వచ్చే బ్యాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధి. దీని ద్వారా దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, ఇతర సమస్యలకు దారితీస్తాయి. పొలాల్లో పనిచేసే ప్రజలు తమ శరీరాలను కప్పి ఉంచుకోవాలని, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. స్క్రబ్ టైఫస్ వ్యాధికి సాధారణ జ్వర లక్షణాలే ఉంటాయి కానీ అజాగ్రత్తతో వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, నిరంతరం జ్వరం, తక్కువ రక్తపోటు, కొన్ని సందర్భాల్లో దగ్గు, జలుబు, శరీరం అంతా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు దోమలు ఎలా కారణం అవుతాయో స్క్రబ్ టైఫస్ జ్వరానికి ట్రాంబికుల్లిడ్ మైట్స్ అనే ఒక రకమైన కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తోంది. ముందుగా గుర్తించినట్లు అయితే ఈ వ్యాధిని ఎదుర్కోవడం సులభం అని రోగ నిర్థారణ ఆలస్యం అయితే ప్రాణంతకం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu