Ad Code

దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలి !


దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. త్వరలో అమల్లోకి తేనున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదా విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టిజి.భరత్ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి గతంలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 15 శాతానికి పైగా వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా నూతన ఇండస్ట్రియల్ పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. 2014-19 కాలంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలతో అగ్ర స్థానంలో ఉన్నామన్నారు. ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉండేవారిమని గుర్తు చేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వంపై ఒక నమ్మకం కలిగే రీతిలో నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పిపిపి, పి-4 విధానాలను నూతన విధానంలో పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటు అవుతాయని, ఆ దిశగా కృషి చెయ్యాలని సీయం అన్నారు. దేశంలో ఏరాష్ట్రానికి లేని రీతిలో 10 ఓడరేవులు,10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నారు. కావున పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని సీయం చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశానికి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా దానిని ఏపికి తీసుకువచ్చే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో కర్నాటకకు వెళ్ళి పోయిన హీరో మోటార్స్, తెలంగాణాకు వెళ్ళిపోయిన అపోలో టైర్స్ వంటి సంస్థలను మళ్ళీ ఏపీకి తీసుకువచ్చామని సియం చంద్రబాబు గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహారశుద్ధి వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమల స్థాపన జరిగేలా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం రూపకల్పన జరగాలని చంద్రబాబు చెప్పారు. ఈనెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నామని, అదే విధంగా ఈనెల 23న మళ్లీ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానంపై మరొకసారి సమావేశమై చర్చిద్దామని సీయం చంద్రబాబు అధికారులకు సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu