Ad Code

రేపటితో ముగియనున్న 'తరంగ్‌ శక్తి 2024' మొదటిదశ యుద్ధ విన్యాసాలు !

నెల ఆరో తేదీ నుంచి తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైన 'తరంగ్‌ శక్తి 2024' మొదటిదశ యుద్ధ విన్యాసాలు రేపటితో ముగియనున్నాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొన్నట్లు తెలిసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించేందుకు 'తరంగ్‌ శక్తి' మంచి వేదికని మంగళవారం డీఆర్‌డీఓ ఛైర్‌పర్సన్ సమీర్ వి కామత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత వైమానిక దళం ఆధ్వర్యంలో జరుగుతున్న తరంగ్ శక్తి ఎక్సర్‌సైజ్‌ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించేందుకు మంచి వేదిక. అవసరమైనప్పుడు దేశాన్ని రక్షించగల సామర్థ్యం ఉందని భారత ప్రజలకు తెలియజేసే అవకాశంగా ఈ కార్యక్రమం నిలిచింది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఏఎంసీఏ ఫైటర్ జెట్ (స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌) డిజైన్‌ పూర్తయింది. అభివృద్ధి ట్రయల్స్‌ను త్వరలో నిర్వహించి 2034 నాటికి దాన్ని సైన్యానికి అందిస్తాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసే అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి' అని అన్నారు. తరంగ్‌ శక్తి యుద్ధ విన్యాసాలు రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌స్టాఫ్, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు ఈసారి రష్యా, ఇజ్రాయిల్‌ దూరంగా ఉన్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్‌-18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ-130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్‌-16, స్పెయిన్‌కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్‌-16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్‌ఏకి చెందిన ఏ-10, ఎఫ్‌-16, ఎఫ్‌ఆర్‌ఏ, సింగపూర్‌కు చెందిన సీ-130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu