జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని దేసా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవానులు వీరమరణం పొందారు. మరణించిన వారిలో ఒక అధికారి కూడా ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బంది కూడా గాయపడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల జాడపై నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని, భారీ కాల్పులు జరిగాయని భారత ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. పలువురు సైనికులకు గాయాలయినట్టు ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోందని వివరించింది. ఇంటెలిజెన్సీ సమాచారంతో సైనికులు రంగంలోకి దిగారని వివరించింది. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నట్టు ఆర్మీ వెల్లడించింది. జమ్మూ ప్రాంతంలో ఇటీవల జరిగి రెండో అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు చెబుతున్నారు. గతవారం కథువాలో ఐదుగురు సైనికులు మరణించారని, ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని చెప్పారు.
0 Comments