ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. పలు కేసుల్లో దోషిగా తేలడం, మరికొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా 21 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్న లార్డ్ ప్యాటెన్ (80 ఏళ్లు) రాజీనామాతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఈ పదవికి ఇమ్రాన్ పోటీ చేయనున్నట్లు ఆయన అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు జుల్ఫీ బుఖారీ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఇమ్రాన్ నుంచి స్పష్టత వచ్చాక బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.ఈ రేసులో ఖాన్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇమ్రాన్ తరఫు న్యాయవాది తెలిపారు. 1972లో ఆక్స్‌ఫర్డ్‌లో ఎకనమిక్స్, పాలిటిక్స్ విద్యనభ్యసించిన ఇమ్రాన్ ఖాన్.. 2005 నుంచి 2014 వరకు బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా పనిచేసినట్లు జియో న్యూస్ తెలిపింది.
0 Comments