చైనాతోపాటు ఉత్తర కొరియా, తైవాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షం కారణంగా వచ్చిన వరదలతో పదుల సంఖ్యలో మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈశాన్య చైనాలో 27,000 మందికి పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించగా, వందలాది కర్మాగారాలు మూతపడ్డాయి. గమేమీ తుఫాను బీభత్సం సృష్టించడంతో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు ఇంకొన్ని చోట్ల ఇళ్లపై మట్టి చరియలు పడటంతో చైనాలో 11 మందికిపైగా మరణించారు. మరోవైపు ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న జిలిన్ ప్రావిన్స్‌లో కూడా ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలు, కర్మాగారాలు, వ్యాపారాలను మూసివేశారు. ఈ క్రమంలో వరదలు మరింత తీవ్రమవుతాయని అక్కడి ప్రజలకు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారు వరదల్లో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రంలో కిమ్ కారు వరద నీటిలో మునిగి ఉండటం కనిపిస్తోంది. చిత్రంలో కారు టైర్ల వరకు వరద నీరు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే కిమ్ జోంగ్ ఉన్ వరద ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్న క్రమంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా, చైనా సరిహద్దు వెంబడి వరద బాధిత ప్రాంతాల నుంచి 5,000 మందిని రక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సోమవారం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర కొరియా సైన్యం ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి కార్యకలాపాలను ప్రారంభించింది. ఉత్తర కొరియా, చైనా మధ్య సరిహద్దులో భాగమైన అమ్నోక్ నది, చైనీస్‌లోని యాలు నది వద్ద నీటి మట్టాలు రికార్డు స్థాయికి చేరుకుని ప్రమాద రేఖను అధిగమించాయని తెలిపింది. ఇదే సమయంలో దక్షిణ చైనా లోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, హైనాన్ ద్వీపంలో రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. తుఫాను ఉత్తరం వైపుకు వెళ్లడంతో కొన్ని ప్రయాణీకుల రైలు మార్గాలు దక్షిణ ప్రావిన్సులైన ఫుజియాన్, జియాంగ్‌జీలో పునఃప్రారంభించబడ్డాయి. టైఫూన్ గేమీ ప్రభావంతో తైవాన్‌లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఇంకోవైపు ఫిలిప్పీన్స్‌లో కూడా ఈ ప్రభావం కనిపించింది. ఈ తుపాను ఫుజియాన్‌లో దాదాపు 630,000 మందిని ప్రభావితం చేసింది. వీరిలో సగం మంది వేరే చోటికి మార్చబడ్డారు. ఈ క్రమంలో విపరీతమైన నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి.
0 Comments