మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం అయిదేళ్లు పాలన సాగించలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శుక్రవారం ముంబైలోని బాంద్రాలో శివసేన (యుబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నివాసంలో ఆయనతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్డీయే ప్రభుత్వం అయిదేళ్ల కొనసాగలేదు, ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండదని జోస్యం చెప్పారు. అలాగే ఇండియన్ పినల్ కోడ్ స్థానంలో మోడీ ప్రభుత్వం భారతీయ న్యాయ సన్నిహిత, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత, భారతీయ సాక్ష్యా అధినీయం చట్టాలను అమల్లోకి తీసుకు వచ్చింది. అయితే వీటిని చట్టాలుగా రూపొందించి, అమల్లోకి తీసుకు వచ్చే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా ఆమె సోదాహరణగా వివరించారు. ఈ చట్టాలు తయారు చేసే క్రమంలో ఎవరితో సంప్రదింపులు జరపలేదన్నారు. అలాగే చాలా మంది ఎంపీలపై సభలో సస్పెన్షన్ చేసి ఆ తర్వాత వీటిని ఆమోదించారని సీఎం మమతా బెనర్జీ గుర్తు చేశారు. అయితే గతంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి తాను మద్దతు పలకబోవడం లేదన్నారు. ఏదైనా ముందు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముంబై వాయువ్య లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగిన శివసేన అభ్యర్థి ఓటమిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇతర నియోజకవర్గాల్లో సైతం ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. తమ రాష్ట్రంలో ఇండియా కూటమిలో చాలా బలంగా ఉందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే గత చరిత్ర నేపథ్యంలో సీపీఐ(ఎం)తో కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి శివసేన గుర్తును తొలగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అనైతికమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత ముంబై అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు మమతా బెనర్జీ సుముఖత వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రేలు భేటీ కావడం ఇదే తొలిసారి.
0 Comments