Ad Code

అస్సాంలో 'క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌' స్కామ్‌ ?


బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాంలో పరీక్షలకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గౌహతి యూనివర్సిటీలో 'క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌' స్కామ్‌ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గౌహతి యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న గణేష్ లాల్ చౌదరి కాలేజీకి చెందిన విద్యార్థి అజీజుల్‌ హక్‌ మార్క్‌షీట్‌లో తేడా కనిపించింది. పరీక్షలకు సంబంధించిన వాస్తవ మార్కులు మార్క్‌షీట్‌లోని మార్కుల మధ్య తేడాను కాలేజీ యాజమాన్యం గమనించింది. యూనివర్సిటీకి పంపి తనిఖీ చేయించింది. విద్యార్థి డబ్బులు చెల్లించి మార్కులు పెంచుకున్నట్లు బయటపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సీఐడీ విభాగం దీనిపై దర్యాప్తు చేసింది. విద్యార్థి అజీజుల్‌ హక్‌ను ప్రశ్నించగా మొదటి, మూడు, నాలుగు, ఐదవ సెమిస్టర్‌లలో మార్కులు మార్చడానికి రూ.10,000 చెల్లించినట్లు అంగీకరించాడు. దీంతో గౌహతి యూనివర్సిటీ మార్క్‌షీట్‌లతో వ్యవహరించే కంప్యూటర్ సిస్టమ్‌ ఆపరేట్ చేసేవారు విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని మార్క్‌షీట్‌లను డిజిటల్‌గా ట్యాంపరింగ్‌ చేసినట్లు గుర్తించారు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం సంస్థ నిర్వహించే ఐటీఐ లిమిటెడ్ అనే డేటా ఎంట్రీ సంస్థకు గౌహతి యూనివర్సిటీ అవుట్‌సోర్సింగ్‌ ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. థర్డ్ పార్టీ ఆపరేటర్‌ ద్వారా డిజిటల్‌ మార్క్‌షీట్ల ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించారు. నిందితులైన కే కృష్ణమూర్తి, ఇస్మాయిల్ హుస్సేన్, అలంగీర్ ఖాన్, మొయినుల్ హక్, అబుల్ బాసర్, అమీనుల్ ఇస్లాం, హమేజుద్దీన్, శివతోష్ మహతోను అరెస్ట్‌ చేశారు. దర్యాప్తును విస్తృతం చేయడంతో మరి కొంతమంది అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu