ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కసరత్తుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో విపక్ష ఇండియా కూటమి సమావేశమైంది. ఈ భేటీలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత తాము ఎన్నికల ఫలితాల ప్రాధాన్యతను విశ్లేషిస్తామని చెప్పారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై భాగస్వామ్య పార్టీలను సంప్రదిస్తామని చెప్పారు. తమకు చాలా సమయం ఉందని, ఎన్డీయే కూడా వారి ప్రయత్నాలు వారు చేసుకుంటారని అన్నారు. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా ముందుకొస్తే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ, టీడీపీ కీలకంగా మారడంతో ఆయా పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు ఇండియా కూటమి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడులతో చర్చించే బాధ్యతను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు అప్పగించవచ్చని భావిస్తున్నారు. ఇక ఇండియా కూటమి సమావేశానికి తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జేఎంఎం నేత కల్పనా సొరేన్ సహా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.
0 Comments