పార్లమెంట్‌లో ఓ వైపు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యనేత అభిషేక్ బెనర్జీ మంతనాలు సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి దూరంగా ఉన్న తృణమూల్‌ను మళ్లీ దారిలోకి తెచ్చేందుకే రాహుల్ చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. లోక్‌సభ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది. సంప్రదాయం ప్రకారం సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు అధికార పక్షం ప్రయత్నాలు విఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని ప్రతిపక్షం చేసిన డిమాండ్‌కు పాలక పక్షం అంగీకరించలేదు. దీంతో రాజ్యాంగ నిబంధనలను అనుసరించి స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. విపక్షం తరఫున కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ నామినేషన్ వేయగా.. ఎన్డీయే తరఫున ఓం బిర్లా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తొలుత ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్.. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌తో విభేదాలు ఏర్పడి.. పశ్చిమబెంగాల్‌లో ఒంటరిగానే బరిలోకి దిగింది. దీంతో ప్రస్తుతం మళ్లీ ఇండియా కూటమికి మద్దతిస్తుందా? లేదంటే.. గతంలో బిజు జనతాదళ్ మాదిరిగా తటస్థంగా ఉండిపోతుందా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, తాజాగా ఇద్దరు కీలక నేతలు మంతనాలు సాగించడం, నదీజలాల పంపిణీ అంశంలో కేంద్రం తీరును విమర్శిస్తూ మమతా బెనర్జీ మోదీకి లేఖ రాయడం తదితర సందర్భాలు తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమికి మద్దతిస్తుందన్న సంకేతాలు పంపుతున్నప్పటికీ తుది నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ.. మీడియాతో మాట్లాడుతూ తనను ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లా కలిసి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని చెప్పారు. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై చర్చించేందుకు పార్టీ అధినేత్రి సమక్షంలో ఎంపీలంతా భేటీ అవుతామని, అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పారు. మరోవైపు సంప్రదాయానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టడంపై మమతా బెనర్జీ కలత చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తృణమూల్ నిర్ణయంపై ఉత్కంఠ రేగుతోంది.
0 Comments