Ad Code

బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదు : నవీన్ పట్నాయక్


బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తన పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. జూన్ 27 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు ఎగువ సభ సమావేశాలలో బలమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని పట్నాయక్ వారికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను తగిన రీతిలో లేవనెత్తాలని ఎంపీలను కోరారు. సమావేశం అనంతరం రాజ్యసభలో పార్టీ నేత సస్మిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈసారి బీజేడీ ఎంపీలు కేవలం సమస్యలపై మాట్లాడటానికే పరిమితం కానున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒడిశా ప్రయోజనాలను విస్మరిస్తే ఉద్యమించాలని నిర్ణయించాం’ అని తెలిపారు. ఒడిశాకు ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తడమే కాకుండా.. రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ, తక్కువ సంఖ్యలో బ్యాంకు శాఖల సమస్యను కూడా పార్టీ ఎంపీలు లేవనెత్తుతారని సస్మిత్ పాత్ర తెలిపారు. మరోవైపు.. బొగ్గు రాయల్టీలో సవరణ చేయాలన్న ఒడిశా డిమాండ్‌ను గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని.. వారికి దక్కాల్సిన వాటా దక్కకుండా పోతుందన్నారు. రాజ్యసభలో 9 మంది ఎంపీలు బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని సుస్మిత్ పాత్రా తెలిపారు. ఇకపై.తాము బీజేపీకి మద్దతు తెలిపేది లేదని, ప్రతిపక్షంగానే కొనసాగుతామని తెలిపారు. ఒడిశా ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. ఒడిశా డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం విస్మరిస్తే.. బలమైన, శక్తివంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తమ అధ్యక్షుడు చెప్పారని సుస్మిత్ పాత్రా పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu