తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్‌కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు. విజయలక్ష్మి నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె, మహేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్‌లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్‌కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్‌తో కలిసి గజేందర్‌ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మహేశ్‌కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్‌కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద నిందితులు ముగ్గురూ కాపు కాశారు. గజేందర్‌ను మొదట వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండలతో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్‌ను వెంటబెట్టు కుని హుటా హుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
0 Comments