ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆంతరంగికుడిగా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ ఓటమి నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. తాను నవీన్ పట్నాయక్‌కు సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రయాణంలో ఎవర్నైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అలాగే, తనపై జరిగిన ప్రచారం వల్ల పార్టీ ఓటమి పాలై ఉంటే అందుకూ క్షమించాలన్నారు. నవీన్ మరోసారి విజయం సాధించని పక్షంలో తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని గతంలో చెప్పిన పాండ్యన్ అందుకు తగ్గట్టే తన నిర్ణయాన్ని వెలువరించారు. తమిళనాడుకు చెందిన పాండ్యన్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి వచ్చి నవీన్ విధేయుడిగా మారి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. ఎన్నికల ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి బిజూ జనతా దళ్‌లో చేరారు. నవీన్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఆయన్ను విమర్శకులు 'సూపర్ సీఎం' అని పిలిచేవారు. బయటివ్యక్తి అంటూ భాజపా బలమైన ముద్ర వేసింది. ఎన్నికల ప్రచార అస్త్రంగానూ వాడుకుంది. నవీన్ వారసుడంటూ ప్రచారం చేసింది. ఓ విధంగా ఒడిశాలో బీజేడీ అప్రతిహత విజయాలకు బ్రేక్ పడింది పాండ్యన్ వల్లేనన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.
0 Comments