Ad Code

జొమాటోతో పేటీఎం రూ.1,500 కోట్ల డీల్‌ ?


ఆర్‌బీఐ ఆంక్షలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం వాటి నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు ఆహార పంపిణీ సంస్థ జొమాటోతో చర్చలు జరుపుతోంది. సినిమాలు, కార్యక్రమాల టికెట్‌ బుకింగ్‌ వ్యాపారాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విలువ రూ.1,500 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆహారం, నిత్యావసర సరకులు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన బుకింగ్‌ బిజినెస్‌లకు ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి రెండు విభాగాల్లో దూసుకెళ్తున్న జొమాటో వినోదరంగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పేటీఎం మార్కెటింగ్‌ సర్వీసెస్‌లో భాగమైన మూవీ, ఈవెంట్‌ టికెటింగ్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పేటీఎంతో జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. దీనిపై ఇరు సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ 2017లో ఇన్‌సైడర్‌.ఇన్‌ను సొంతం చేసుకుంది. ఈవెంట్ల ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సేవలను అందించే ఈ సంస్థను రూ.35 కోట్లకు కొనుగోలు చేసింది. తర్వాత చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ 'టికెట్‌న్యూ'ను సొంతం చేసుకుంది. తద్వారా పేటీఎం మార్కెటింగ్‌ సర్వీసెస్‌లో కీలక విభాగంగా మూవీ, ఈవెంట్‌ టికెటింగ్‌ అవతరించింది. ఈ వ్యాపారంలో ఇప్పటికే మంచి ఆదరణ ఉన్న 'బుక్‌మైషో'కు పోటీగా నిలిచింది. 

Post a Comment

0 Comments

Close Menu