2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.11 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెండ్‌గా చెల్లించేందుకు నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆర్‌బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈమేరకు సమావేశమై మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయమై ఆమోదం తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించింది. దీంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140 శాతం అధికంగా డివిడెండ్ చెల్లిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది రూ.75,000-1,20,000 కోట్ల మేర నిధులు బదిలీ చేస్తారని ఆర్థిక వేత్తలు అంచనా వేయగా.. అంతకుమించి చెల్లించేందుకు ఆర్‌బీఐ బోర్డు నిర్ణయించింది. ఆర్‌బీఐ ఇచ్చిన డివిడెండ్ వల్ల కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కంటిన్‌జెంట్ రిస్క్ బఫర్ లెవల్‌ను కూడా 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. ఏటా ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంటుంది. పెట్టుబడులు, డాలరు నిల్వలపై విలువల మధ్య వ్యత్యాసం, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు వంటి రూపాల్లో ఆర్‌బీఐకి ఆదాయం సమకూరుతుంటుంది. ఇందులో మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేస్తుంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.1.02 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఒక్కటే అంచనాలకు మించి డివిడెండ్ ప్రకటించడమంటే 'డబుల్' బొనాంజా అనే చెప్పాలి.
0 Comments