స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొన్నేళ్ల నుంచి చర్యలు తీసుకుంటున్నా, యూజర్లకు అంతగా ఉపశమనం కలగడం లేదు. అయితే వచ్చే ఏడాది ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. స్పామ్ కాల్స్ రాకుండా ఉండటానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డోంట్ డిస్టర్బ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇది చాలా కాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రయోజనాలను అందించలేకపోయింది. వచ్చే ఏడాది సరికొత్తగా లాంచ్ కానుంది. వచ్చే ఏడాది సరికొత్త మార్పులతో డీఎన్‌డీ యాప్‌ను ట్రాయ్ తీసుకొస్తుందని ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. ఇబ్బందికర స్పామ్ కాల్‌లను రిపోర్ట్ చేయడంలో యూజర్లకు సహాయపడే డోంట్ డిస్టర్బ్ యాప్‌లోని బగ్‌లను పరిష్కరిస్తున్నట్లు ట్రాయ్‌కు చెందిన ఓ అధికారి ఇటీవల తెలిపారు. టెలికాం రెగ్యులేటర్ బాడీ డీఎన్‌డీ యాప్‌లోని బగ్‌లను పరిష్కరిస్తోందని ఆ సంస్థ సెక్రటరీ వి.రఘునందన్ తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. 'యాప్‌లోని సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఓ ఏజెన్సీ ఏర్పాటు చేశాం. ఇది బగ్‌లను గుర్తించి పరిష్కరిస్తుంది, కొన్ని ఆండ్రాయిడ్ పరికరాలతో సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయి. సరికొత్త డీఎన్‌డీ (DND) యాప్ వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది.' అని రఘునందన్ తెలిపినట్లు పీటీఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. మొబైల్ యూజర్లు కాల్ లేదా మెసేజ్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు DND యాప్ ఎర్రర్ చూపించిందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఐఫోన్ యూజర్లు ఇప్పటివరకు డీఎన్‌ఏ యాప్‌ను ఉపయోగించలేకపోయారు. కఠినమైన యాప్ స్టోర్ విధానాలను యాపిల్ అవలంభించడమే అందుకు కారణం. డీఎన్‌ఏ యాప్ వినియోగిస్తే సెక్యూరిటీ రిస్క్ పెరుగుతుందని భావించిన యాపిల్... ఐఫోన్స్ కాల్ లాగ్‌లకు యాక్సెస్ అందించలేదు. అయితే iOS పరికరాల్లో కూడా DND యాప్ పని చేస్తుందని నిర్ధారించడానికి ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ట్రాయ్ అధికారి పేర్కొనడం గమనార్హం.
0 Comments