Ad Code

టెస్లాకు 5జీ ప్రైవేట్ క్యాప్టివ్ నెట్ వర్క్ నిర్మిస్తామని రిలయన్స్ ప్రతిపాదన ?


భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నది. ఈ విషయమై గతవారం కేంద్ర ప్రభుత్వంతో టెస్లా ప్రతినిధులు చర్చలు జరిపింది. దేశీయంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తోపాటు ఇన్నోవేషన్ బేస్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో టెస్లా యాజమాన్యానికి ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఓ ఆఫర్ అందించింది. భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే టెస్లాకు అనుబంధంగా ఒక 5జీ ప్రైవేట్ క్యాప్టివ్ నెట్ వర్క్ నిర్మిస్తామని రిలయన్స్ ప్రతిపాదించింది. ఈ నెట్ వర్క్ సాయంతో సంబంధిత టెస్లా కంపెనీ తన కనెక్టెడ్ కార్ సొల్యూషన్స్, ఆటోమేషన్ ఆఫ్ ప్రొడక్షన్ తదితర కీలక ఆపరేషన్లను పర్యవేక్షించడం తేలికవుతుందని రిలయన్స్ ప్రతిపాదించినట్లు సమాచారం. టెస్లా, రిలయన్స్ మధ్య చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆయా వర్గాల కథనం. భారత్ లో టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు ప్రణాళికను బట్టి రెండు సంస్థల మధ్య చర్చలకు ఒక రూపం ఏర్పడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. జియో సంప్రదింపులతో భారత్ లో టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టెస్లా ప్రతినిధులతో జరిపిన చర్చలపై స్పందించడానికి రిలయన్స్ జియో నిరాకరించింది. ఆటోమొబైల్‌తోపాటు హెల్త్ కేర్, మాన్యుఫాక్చరింగ్, ఇతర పరిశ్రమల్లో కనెక్టివిటీ కోసం 5జీ సేవలు అవసరం అని జియో ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. రిలయన్స్ జియో ప్రతిపాదిత 5జీ ప్రైవేట్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుంటే.. సంబంధిత సంస్థ పరిధిలో హై డేటా స్పీడ్, డేటా క్యారియింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. మాన్యుఫాక్చరింగ్ రంగంలో 4.0 టెక్నాలజీతో లబ్ధి పొందాలని వివిధ రంగాల పరిశ్రమలు భావిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా చకాన్ యూనిట్ పరిధిలో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థతో భారతీ ఎయిర్ టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలతో పలు పారిశ్రామిక సంస్థలు సొంతంగా 5జీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu