కాల్స్, మెసేజ్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్న స్కామర్లను నియంత్రించే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తోంది. తాజాగా ఏదైనా నెట్‌వర్క్ అంతరాయాలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లకు ట్రాయ్ ఆదేశించింది. నెట్‌వర్క్ సమస్యకు గల మూల కారణాలు, పరిష్కరించేందుకు తీసుకున్న చర్యల గురించి పూర్తి సమాచారం అందించాలని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు నాలుగు గంటల కంటే ఎక్కువ కాలం పాటు నిరంతరాయంగా సర్వీస్‌లో అంతరాయాలు ఏర్పడితే తప్పనిసరిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి నివేదించాలి. ఘటన చోటుచేసుకున్న 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలి. దీనికి సంబంధించి టెలికాం అథారిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో 'టెలికాం నెట్‌వర్క్‌ల విషయంలో ప్రధాన నెట్‌వర్క్ అంతరాయాలు సాంకేతిక కారణాల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవిస్తున్నాయి. అలాంటి సమస్యలను ఆపరేటర్లు మా దృష్టికి తీసుకురావడం లేదు. ఇప్పుడు ఇచ్చిన తాజా ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. దేశంలోని ఈ ప్రధాన నెట్‌వర్క్ అంతరాయాలు, ముఖ్యంగా బార్డర్, కొండ ప్రాంతాలలో చోటు చేసుకుంటున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సర్వీస్ అవైలబిలిటీ, క్వాలిటీ సమస్యగా మారుతోంది.' అని ట్రాయ్ తెలిపింది. ప్రధాన నెట్‌వర్క్ అంతరాయాలకు మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి, స్థానిక అధికారుల నుంచి సంబంధిత సహాయాన్ని పొందాలని ట్రాయ్ సూచించింది. జిల్లా స్థాయిలో అలాంటి ఏదైనా అంతరాయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. ట్రాయ్ ఛైర్మన్ పి డి వాఘేలా, సెక్రటరీ వి రఘునందన్ అన్ని టెలికాం ఆపరేటర్‌లను కలిసి ఇబ్బందికరమైన కాల్స్, అన్‌వాంటెడ్ టెక్స్ట్ మెసేజ్‌లను ఆపడానికి గల మార్గాల గురించి చర్చించారు. టెలికాం కంపెనీలు డిటెక్ట్ సిస్టమ్ అమలును సమీక్షించడానికి మే 1ని గడువుగా ట్రాయ్ పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యునికేషన్స్, అన్‌వాంటెడ్ టెక్స్ట్ మెసేజ్‌లు, కాల్స్ బెడదను ఎదుర్కోవడం లక్ష్యమని సూచించింది. ట్రాయ్ ప్రిన్సిపల్ ఎంటిటీలు, టెలి-మార్కెటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని పిలుపునిచ్చింది. అన్‌వాంటెడ్ టెక్స్ట్ మెసేజ్‌లు, కాల్స్‌ను గుర్తించడం కోసం శాండ్‌బాక్స్ డ్రిల్ అమలును సమీక్షించాలని రెగ్యులేటరీ టెల్కోలను కోరింది. అదే విధంగా అన్‌యూజ్డ్ హెడర్‌ను బ్లాక్ చేయాలని ట్రాయ్ పీఈలను ఆదేశించింది. ట్రాన్సాక్షన్‌లు లేదా సేవా సంబంధిత నోటిఫికేషన్‌ల కోసం ముఖ్యమైన వాయిస్ కాల్‌లను పంపడం కోసం కొత్త నంబర్ సిరీస్‌ని ఉపయోగించాలని రెగ్యులేటర్ టెల్కోలను ఆదేశించింది. అనుమానిత స్కామర్‌ల జాబితాను టెల్కోలు ఉమ్మడి ప్లాట్‌ఫారమ్‌లో పంచుకోవాలని, మెసేజ్ ట్రాన్సాక్షన్‌లను ముందస్తుగా నిరోధించాలని సూచించింది. ఇబ్బందికరమైన కాల్స్, అన్‌వాంటెడ్ మెసేజ్‌లను ప్రభావవంతంగా పర్యవేక్షించడం కోసం అన్ని వాయిస్-బేస్డ్ టెలిమార్కెటర్‌లను ఉమ్మడి DLT ప్లాట్‌ఫారమ్ కిందకు తీసుకురావాలని పేర్కొంది. ఆపరేటర్లు AI/ML బేస్డ్ యాంటీ-ఫిషింగ్ సిస్టమ్‌లను చురుకుగా ఉపయోగించాలని, ప్రొమోషనల్ వాయిస్ కాల్స్‌ను ఎదుర్కోవడానికి DLT ప్లాట్‌ఫారమ్‌లో సాంకేతిక పరిష్కారాలను అమలు చేయాలని కోరింది.
0 Comments